17, మే 2014, శనివారం

శబ్దపరిణామంలో ఊనిక పాత్ర-2

ప్రాచీనాంధ్రులు పదంలో ఏ అక్షరం మీద ఊనిక పెట్టేవారు ?
ర్తమానాంధ్రంలో పూర్వోక్త పద్ధతిన పదాది ఊనికే ప్రచురం. కానీ ప్రాచీనాంధ్రంలో మాత్రం ఏతద్విపర్యాసంగా పదమధ్య ఊనిక విస్తారమనడానికి ఆధారాలు లేకపోలేదు. నిజానికి ఇప్పుడు కూడా, అన్నిపదాల్లోనూ కాదు గానీ, వకారాది పదాల్లో మట్టుకూ ఆది వకారాన్ని పరిహరించిన పలుకుబడి బహుతఱచుగా చెవిన పడుతుంది. అయితే ఇది పదమధ్య ఊనిక ప్రభావమేనని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఉదాహరణకి-
అపవాదం :- వాగుడు, వింత, వెచ్చాలు మొ||    
పదమధ్య ఊనికను పురస్కరించుకొని ప్రాచీనకాలంలో పదమధ్య ధ్వనులు మిగిలి పదాది ధ్వనులు వైకల్పికంగా లోపించేవి. ఇది హెచ్చుగా చకార, పకారాల విషయంలో జఱిగేది. ఉదాహరణకి- 
(ఇక్కడ పదాల ముందుంచిన నక్షత్ర చిహ్నాలు - అవి లిఖిత సాహిత్యంలో నమోదు కాకుండానే అంతరించాయనడానికీ, వాటిని ఊహాజనితంగా పునర్ నిర్మించడం జఱిగిందనడానికీ సూచన)
ఇలా పదాది హల్లులు లోపించడం నేరుగా జఱిగిపోయిందా ? లేక అవి లోపించడానికి ముందు వాటికి గసడదవాదేశం (lentition) లాంటి ఇంకో పరిణామదశ ఏదైనా ఉండి ఉంటుందా ?” అనేది పరిశోధనీయం. పై ఉదాహరణల్లో గసడదవాదేశం కూడా తదనంతర కాలంలో లయించి వాటి గుణితాచ్చు మాత్రం శేషించి ఉండవచ్చు, ఎదవ, ఎళ్ళు లాంటి పదాల్లో మాదిరి ! ఎందుకంటే కొన్ని పదాల్లో ఆది పకారానికి గసడదవాదేశం జఱిగి వకార రూపాలు వాడుకలోకొచ్చిన జాడలు కానవస్తున్నాయి. ఉదాహరణకి-
సమకాలీన తెలంగాణ మాండలికపు టుచ్చారణలో పదాది పకారానికి తెఱగు గసడదవాదేశం నేటికీ సజీవమే.
ఉదా:- ఆడు పొద్దుగాల్నే గింత దిని పనికి వోతడు.
పదమధ్య ఊనిక మూలాన కొన్నిమార్లు పదాద్యచ్చు సంహితారూపంగా ద్వితీయాక్షరంలో లీనమయ్యేది. ఉదాహరణకి-
కానీ మన కాలపు తెలుగులో పదమధ్య ఊనికతో మాట్లాడే వాడుక ఎక్కడా లేదు. అటువంటప్పుడు మఱి పదాది ఊనిక పుంజుకున్నది ఎప్పటినుంచి ? అనే విచికిత్స తలెత్తక మానదు. నా అభిప్రాయంలో- ఇది మనం సంస్కృత సంపర్కం మూలాన చేసుకున్న అలవాటు. ఎందుకంటే సంస్కృతోచ్చారణకి ఇలాంటి ఊనిక తప్పనిసరి. అప్పటినుంచి మన భాషలో అంతకు ముందులాగా పదాది ధ్వనులు తొలగిపోవడమనే ప్రక్రియ నిలిచిపోయినట్లు కనిపిస్తుంది. దాన్తో పాటు పదద్వితీయాక్షరంగా ఉన్న రేఫ, *[ష్జ/] కారాలు పదాది హల్లుతో సంయుక్తమై, ద్రావిడభాషల్లో ఎక్కడా లేని విధంగా, క్రావడి రూపాలకి నాంది పలికినట్లు తోస్తుంది. ఉదాహరణకి- 

సరవి స్రావి
పరుప్పు ప్రప్పు
పఱచు/పఱువు పర్వు, ప్రబ్బు
తిరుప్పు త్రిప్పు
మరను మ్రాను
విరళు వ్రేలు
లు కదలు/ క్రాలు
కిழுన్ద క్రింద
ప్రాత
పొழுదు ప్రొద్దు మొ||                                                         
(సశేషం)

15, మే 2014, గురువారం

శబ్దపరిణామంలో ఊనిక పాత్ర-1
పదస్వరూపం ఉచ్చారణవశాన కాలక్రమంలో మారడమే శబ్దపరిణామం. నిజానికి అనేక వర్ణపరిణామాల పర్యవసానమే శబ్దపరిణామం. ఇది చాలా రకాలుగా ఉంటుందని భాషాశాస్త్రవేత్తలు అభివర్ణిస్తారు. వాటిల్లో ముఖ్యమైనవి కొన్ని :-

. వర్ణాగమం       (Epenthesis)
. వర్ణలోపం       (Elision)
. వర్ణవ్యత్యయం   (Metathesis)
. లోపశేషం        (Cheshirization)
. పరుషాదేశం    (Fortition)
. సరళాదేశం     (Lentition)
. సదృశీభవనం   (Assimilation)
. మిథ్యామ్రేడితం   (Haplology)

ఆయా వర్ణపరిణామాలు ఎందుకు సంభవిస్తాయో వాస్తవంగా ఇప్పటికీ తెలీదు. ఒకే భాషనుంచి ఉద్భవించిన వేఱువేఱు భాషలు మూలభాషాపదాల్ని వేఱువేఱు స్వరూపాలతో మార్పుచేసుకుని వాడుకోవడమే ఇందుకు నిదర్శనం. మార్పుల వెనక కొన్ని సూత్రాలు ప్రవర్తిస్తున్న మాట నిజమే కానీ అవి ఏదో ఒక జన్యభాషకే తప్ప అన్నిటికీ సమానంగా వర్తించకపోవడం మఱో నిదర్శనం. ఉదాహరణకిదశమ సంఖ్యావాచకం ద్రావిడ భాషల్లో పది, పత్తు, హత్తు అని రకరకాలుగా మారింది. అది తెలుగులో ఒక నియమాన్ననుసరించి మారితే, కన్నడంలో మఱో నియమాన్ననుసరించి మారింది. కనుక, వీటిని సూత్రాలూ, నియమాలూ అనడం కన్నా ఆయా ప్రాంతీయుల సంకల్పాలూ, సౌలభ్యాలూ, వారు చేసుకున్న కొంగ్రొత్త ఉచ్చారణా అలవాట్లూ అనడమే సరి అని చాలాసార్లు తోస్తుంది. సంకల్ప సౌలభ్యాల్నీ, సరికొత్త అలవాట్లనీ నియంత్రించే నియమాలేవైనా ఉన్నట్లు అగుపించదు. కాబట్టి భాషాశాస్త్రంలో కకారం పకారం కావచ్చు. డకారం హకారం కావచ్చు. మకారం చకారమూ కావచ్చు. విధంగా సుదూర కాలగతిలో భాషాధ్వని ఎట్లాగైనా మారొచ్చు. సాధారణంగా వ్యవహారంలో అందఱికీ తెలిసిన, అందఱికీ అవసరమైన ఉమ్మడి పదజాలమే కాలగతిలో నలిగీ నలిగీ మార్పులకు లోనవుతుంది తప్ప సామాన్య జనాంగానికి తెలీనివీ, విద్యావంతులకు మాత్రమే ఎఱుకైనవీ మారవు.  

ముఖప్రయత్నాదుల్ని బట్టే కాక, ఒక వక్తలో శబ్దస్వరూపాన్ని గుఱించి కాలక్రమేణ ఏర్పడిన అవగాహనకోణాల్ని బట్టి కూడా శబ్దపరిణామం చోటు చేసుకుంటుంది. అవగాహన సమీచీనమా ? దోషభూయిష్ఠమా ? దాని పర్యవసానంగా వాడుకలోకొచ్చిన మార్పు ఆమోదనీయమా ? తిరస్కరణీయమా ? అనే చర్చ విషయాంతరం. అది ఏదైనప్పటికీ అది జఱిగే సంభావ్యత మాత్రం ఉంది. ఉదాహరణకి- ప్రాచీన తెలుగులో పొదరు అంటే పొద. ఏదో ఒక చారిత్రిక దశలో శబ్దాన్ని పొదలు అని ఉచ్చరించడం మొదలైంది. అప్పుడు సదరు పదాంత్య లువర్ణాన్ని బహువచనార్థకంగా భ్రమించడం జఱుగుతుంది. కాబట్టి దాని ఏకవచన ప్రాతిపదిక రూపం పొద అయ్యుంటుందని ఊహించి అలాగే ఉపయోగిస్తున్నారు ఆధునికాంధ్ర వక్తలు. ఆధునికాంగ్లంలో కూడా ఇలాంటి పరిణామం కనిపిస్తుంది. ఉదాహరణకి - మా చిన్నప్పుడు sneak అనే క్రియాధాతువుకి strong verb ప్రతిపత్తి లేదు. మేము అభ్యసించిన బ్రిటిష్ ఇంగ్లీషులో దాన్ని sneak – sneaked – sneaked అంటూ weak verbs క్రమంలోనే వాడేవాళ్ళం. ఇప్పుడు దాన్ని sneak – snuck – snuck అనే క్రమంలో వాడడం కనిపిస్తోంది. ఇది stick – stuck – stuck అనే క్రమానికి అనుసరణ (analogy) కావచ్చు. దీన్ననుసరించి భవిష్యత్తులో మఱొకఱు leak – luck – luck అనో, peak – puck – puck అనో కొత్తరూపాల్ని నిష్పాదించినా ఆశ్చర్యపోయే పనిలేదు.

ప్రతి మనిషీ విద్యా-వృత్తుల పరంగా కాకపోయినా, అంతరాత్మికంగా ఎంతో కొంత వైయాకరణే. శబ్దస్వరూపం గుఱించీ, అందులోని ధ్వనుల గుఱించీ అతనిలో అంతర్లీనంగా కొన్ని పూర్వాభిప్రాయాలు ఉంటాయి. నిత్యజీవితంలో అతను వాటికి ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు. కనుక పనిగట్టుకుని కదిలిస్తే తప్ప వాటి నతడు వెల్లడించడు. క్రమంలో ఒక పదాన్ని ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ విఱవాలో, అందులో అక్షరాన్ని ఒత్తి పలకాలో, దేన్ని తేల్చి పలకాలో అంశాల మీద కూడా అతనికి కొన్ని ముందస్తభిప్రాయాలూ, అభిమతాలూ ఉంటాయి. ప్రకారంగానే అతను భాషని మాట్లాడతాడు. అతన్ననుసరించి ఇంకొందఱూ మాట్లాడతారు. 

వక్తలు ఒక పదంలో ధ్వని మీద యాదృచ్ఛికంగా ఊనిక (stress లేదా ఒత్తిడి) పెట్టి మాట్లాడతారనేదాన్ని బట్టి పదం మార్పుకు లోనయ్యే క్రమం ఆధారపడి ఉంటుంది పలుసందర్భాల్లో ! ఉదాహరణకి భాషితాంధ్రంలో మిక్కిలి తఱచుగా వాడబడే లేకపోతే, కాకపోతే అనే అవ్యయాల్ని తీసుకుందాం. వీటిని పరిపూర్ణంగా నాలుగక్షరాలతోనూ నోరారా ఉచ్చరించేవారు ప్రస్తుతం మనలో తక్కువే. గమనిస్తే, ఎక్కువశాతం మందిల్యావోతే/ల్యావతే, కావోతే/కావతేఅని ఉచ్చరిస్తున్నట్లే వినపడుతుంది. పదాల్లో ఆదిన ఉన్న లే-కా వర్ణాలూ, అంతంలోని తేవర్ణమూ అక్షతం (intact) గా మిగలడాన్ని గమనించాలి. అదే విధంగా పదమధ్యంలోని -పోవర్ణాలు మాయం కావడాన్ని కూడా గమనించాలి. భవిష్యత్తులో మధ్యనున్న వకారాదేశాలు కూడా సురిగిపోయి ల్యాతే, కాతే అని మారే అవకాశాన్ని కూడా త్రోసిపుచ్చలేం. దీనిక్కారణం వక్త పదం యొక్క ఆద్యంతాల మీదే ఊనిక పెట్టడం. వాటినే స్పష్టంగా పలికి శ్రోతలో శబ్దార్థ స్ఫురణని కలిగించడం. ఇటువంటి పదాలు (ఆద్యంత ఊనిక ప్రబలమై మధ్యధ్వనులు లోపించడం చేత పరిణామం చెందినవి) ఇంకా కొన్ని ఉన్నాయి. వీటిల్లో అన్నీ వ్రాతలో స్థానం సంపాదించుకున్నవి కావు.

పట్టుకు రా → పట్రా
నాయనా
నానా
రావడం
రాడం
ఒకటి
ఓటి
ఎనిమిది
→ ఎమ్ది 
తొమ్మిది → తొమ్ది 
ఒక నిమిషం
→ ఓ నీషం
భోజనం చెయ్యడం
→ భోంచెయ్యడం
బాగా లేదు → బాలే/బాలా
వలవదు (గ్రాంథికం)
→ వద్దు (వ్యావహారికం) 
నాలుగు రోజులలో → నాల్ రోల్లో
తెలియదు → తెల్దు 
చెయ్యగలిగితే → చైగల్తే 

కొన్ని సందర్భాల్లో రెండో అక్షరం నుంచి కాకుండా మూడో అక్షరం నుంచి పదమధ్య ధ్వనులు తొలగిపోవడం కనిపిస్తుంది. ఉదాహరణకి- 

పచ్చిసెనగ పప్పు → పచ్చెనా పప్పు
మంచినీళ్ళు → మంచీళ్ళు
మనోవ్యాధి → మనాది                                                                (సశేషం)