15, ఏప్రిల్ 2014, మంగళవారం

ళకార మీమాంస-1

ర్వాణ వర్ణమాలలో ళకారం ఉందా ? లేదా ? అనే చర్చ బహుప్రత్నం. అంశం మీద ఎవఱి అభిప్రాయాలు వారికున్నాయి. ఇప్పుడా చర్చ ప్రసక్తం కాదేమో ననుకుంటా. అయితే కొంతకాలం క్రితం నా మిత్రులు కొందఱు చర్చనే మళ్ళీ లేవనెత్తడం జఱిగింది. అది ఒకప్పుడు ఉండేదనడానికి ఆధారాలున్నాయనీ, కాలాంతరంలో కతిపయ కారణాల వల్ల మఱుగున పడిపోయి ఉండొచ్చుననీ నేను చెప్పిన ఉపపత్తులేవీ వారు వినిపించుకున్నారు కారు. కనుక దాని గుఱించి నా అభిప్రాయాల్ని నా పాఠకులతో పంచుకునే నిమిత్తం వ్యాసం వ్రాస్తున్నాను.
1. సంస్కృతంలో ళకారం లేదని వాదించేవారు (ళాభావవాదులు) అందుకు ఉదాహరించే కారణావళి

. ఇతర ఇండో యూరోపియన్ భాషల్లో ఎక్కడా ళకారం లేదు. కాబట్టి సంస్కృతంలో కూడా లేకపోయి ఉండాలి.
. వేదసంస్కృతంలో కనిపించే ళకారం ద్రావిడప్రభావ మూలకమై ఉండొచ్చు.
(ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే- మఱికొందఱు ళాభావవాదులు ఇంకో అడుగు ముందుకు వేసి, “అసలు వేదమంత్రాలకున్న ళకార పాఠాలకి తద్విరహితమైన ముద్రిత పాఠాంతరాలు కూడా ఉన్నాయంటూ మూలచ్ఛేదంగా వాదించసాగారు. అంటే – “ళకార పాఠాలే ఎవఱో అర్వాచీనుల కూటసృష్టిఅన్నట్లు)
. ప్రాకృత భాషల్లో వినబడే ళకారం కూడా ద్రావిడప్రభావ మూలకమే.
. లౌకిక సంస్కృతంలో కూడా పదాలకీ, సాహిత్యానికీ గల ళకార పాఠాలు వింధ్యపర్వతాలకి ఇవతలే లభిస్తున్నాయి తప్ప అవతల ఆర్యావర్తంలో ళకార పాఠాల ప్రసక్తే లేదు. కానీ వింధ్యకు అవతల ఉన్న జనాభాయే విస్తారం. కనుక వారి పాఠాలే ప్రామాణికం. మనవి కావు.
. వేదసంప్రదాయాన్ని నిలబెట్టే నిమిత్తం పాణిని మహర్షి అష్టాధ్యాయి రచించాడు. కానీ అలాంటి అష్టాధ్యాయిలోనే వేదసంస్కృత వర్ణమని చెప్పబడుతున్న ళకారానికి స్థానం లేకపోవడం గమనార్హం.

2. జన్యజనక భాషల మధ్య కొన్ని పోలికలు వైకల్పికం

యావత్తు వాదాన్నీ పర్యాలోచిస్తే దీని పరిధి మన అమాయక ళకారాన్ని దాటి చాలా దూరం పోతున్నట్లుంది. ఉదాహరణకి, ఇండో యూరోపియన్ భాషల ప్రస్తావన. వాటన్నింటికీ ప్రోటో-ఇండో-యూరోపియన్ (P.I.E) అనే ఒకానొక గుర్తుతెలియని ప్రాచీనతమ భాషే మూలమని పాశ్చాత్య భాషాశాస్త్రవేత్తలు నమ్ముతారు. సంస్కృతమూ, ఇతర ఉత్తర భారతీయ భాషలూ ఇండో-యూరోపియన్ భాషాకుటుంబం కిందికే వస్తాయని వారు చెబుతారు. కానీ నా దృష్టిలో P.I.E అనే భాష ఏదీ లేదు. ఉన్నదల్లా సంస్కృతమే. దాన్నుంచే భాషాకుటుంబం యావత్తూ ప్రభవించింది. కాబట్టి దాన్ని ఇండో-యూరోపియన్ కుటుంబం అని కాక సంస్కృత కుటుంబం (Sanskritic family of languages) అనే వ్యవహరించాల్సి ఉంది.  

జనకభాషలోని అన్ని అక్షరాలూ జన్యభాషలకి యథాతథంగా సంక్రమించ నక్కఱలేదు కాబట్టి జన్యభాషల్లో మిగిలున్న అక్షరమాలాశేషాన్ని బట్టి జనకభాష (సంస్కృతం) యొక్క వర్ణమాలాస్వరూపం ఇదమిత్థమని నిర్ధారించడం సాధ్యం కాదు. ఇతర ఇండో-యూరోపియన్ భాషల విషయం అలా ఉంచితే, సంస్కృతం నుంచే ప్రభవించిన ఉత్తర భారతీయ భాషల పదాల్లో పెక్కు సంస్కృతవర్ణాలు లుప్తమయ్యాయి. వాటిని బట్టి సంస్కృతంలో సైతం ఆ అక్షరాలు లేవని వాదిస్తే అది సబబేనా ? తెలుగులో ప్రస్తుతం కారం లేదని చెప్పి మూలద్రావిడంలో కూడా ఒకప్పుడది లేదనడం సరికాదు కదా ! అందుచేత జన్యభాషల్లో లేని ళకారం సంస్కృతంలో ఉండడానికి తార్కిక అభ్యంతరమేమీ లేదు. అదీ గాక జన్యభాషలోనూ ళకారం లేదనడం కూడా సరికాదు. సంస్కృత జన్యాలే అయిన పెక్కు ప్రాకృతాల్లో ళకారం ఖచ్చితంగా ఉండేది.

3. సంస్కృతజన్యమైన పాళీభాషలో ళకారం ఉంది

12 – 13 శతాబ్దాలకు చెందిన సింహరాజు తాను రచించినప్రాకృత రూపావతారమనే వ్యాకరణంలో ఒకచోటలో ళః” (IV – 63) అని సూత్రీకరించాడు. అంటే, ‘సంస్కృతంలోని పదమధ్య లకారం పైశాచీప్రాకృతంలో ళకారంగా మారుతుందని తాత్పర్యం. పైశాచీప్రాకృతాన్ని ఎక్కడ ఎప్పుడు మాట్లాడేవారనే అంశం వివాదాస్పదం. ‘ పిశాచులనే జాతివారి పేరుమీద వారి భాషకు పైశాచిఅని పేరొచ్చిందని కొందఱంటారు. గుణాఢ్య పండితుడు తన బృహత్కథ (కథాసరిత్సాగరం) మొదట రచించినది పైశాచీప్రాకృతంలోనే నని ఐతిహ్యం. అయితే భాషానామంగా కాక మఱే ఇతర రూపంలోనూ పిశాచుల ప్రస్తావన దేశచరిత్రలో లేకపోవడం గమనార్హం. “ పేరు గల జాతే లేనప్పుడు వారికో భాష ఎలా ఉంటుందని అడిగితే భాషానామానికి మనం చెప్పుకుంటున్న అర్థం సరైనది కాకపోవచ్చు. “పాళీభాషకే పైశాచి అని నామాంతరమని Sten Konow, Felix Lacôte, Alfred Master ఇత్యాది సంస్కృత పండితుల అభిప్రాయమట. ( http://en.wikipedia.org/wiki/Paisaci ) ఇదే యథార్థం కావచ్చునని నా ప్రత్యయమూను. కాబట్టి సంస్కృతం నుంచి తొలుదొల్త ఆవిర్భవించిన పాళీలో ళకారం ఉండేదనే మాట వాస్తవం. ఇప్పటికీ దేశదేశాల్లోని బౌద్ధులు ళకార సహితంగానే భాష వర్ణమాలని అభ్యసిస్తున్నారు. కనుక పాళికి మాతృకైన సంస్కృతంలోనూ అది ఉండేదని ఊహించడం అతార్కికం కాబోదు.  

దండి తన కావ్యాదర్శంలో పాళీనిభూతభాషఅని పేర్కొన్నాడు. భూతమంటే పిశాచమనీ, వారి భాషే భూతభాష అనీ ముక్కస్య ముక్కార్థం చెప్పుకోవడం సమీచీనం అనిపించదు. భూతకాలిక (గతంలో ఉన్న) భాష అని చెప్పుకోవడమే సమంజసమేమో. దండి వఱకూ అది భూతకాలిక భాషే. ఎందుకంటే క్రీ.. 6 -7 శతాబ్దులవాడైన దండికి కొద్ది సహస్రాబ్దుల పూర్వం జీవించిన గౌతమ బుద్ధుడి కాలంలో మాట్లాడబడినది పాళీభాష. అదీ గాక వైదిక మతభాష అయిన సంస్కృతం దేవతల భాష అనుకుంటే, మతాన్ని వ్యతిరేకించే బౌద్ధానికి చెందిన పాళీ దెయ్యాల భాష అని కూడా కాలపు వైదికుల అభిప్రాయం కావచ్చు. కనుక పైశాచి అనేది పాళీకున్న పరిహాస నామమే తప్ప అది భాషకీ ఆధికారిక వ్యపదేశం కాకపోవచ్చునని తోస్తుంది. బౌద్ధమతపు ఆదిగ్రంథాలన్నీ పాళీప్రాకృతంలోనే ఉన్నాయి. పాళీభాషలో సాహిత్యకృషి క్రీ.. 4, 5 శతాబ్దుల మధ్య పూర్తిగా స్తంభించినట్లు భావించబడుతోంది. అంటే అంతకు చాలా శతాబ్దుల ముందే అది వ్యవహారదూరమై ఉండాలి.

అంతే కాక, అది ఎప్పట్నుంచీ వ్యవహారంలో ఉండేదన్న వివరం కూడా ఇదమిత్థంగా తెలియరాదు. బుద్ధుడా భాషలో సంభాషించాడంటే ఆయనకంటే చాలా ముందునుంచే అది ఉండి ఉండాలి కదా. ప్రోటో-ఇండో-యూరోపియన్ భాషాసిద్ధాంతం లానే పాశ్చాత్య చరిత్రకారులు నిర్ణయించిన గౌతమబుద్ధుడి కాలం కూడా పలుసందేహాల కాలవాలం. వారు కష్టపడి అన్ని తేదీల్నీ మార్చేశాక బుద్ధుడి తేదీ ఒక్కటీ మారకుండా అక్షతంగా ఉంటుందని ఆశించడం అత్యాశే. సందర్భంగా వలసవాదుల చరిత్రకథనాల్ని పూర్వపక్షం చేయజాలిన ఘటన నా స్మృతిపథంలో మెదుల్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం – 1998 లో ననుకుంటా- గ్రీసుదేశంలో బుద్ధవిగ్రహం బయల్పడింది. దాని కాలాన్ని పరీక్షించిన పురావస్తుశోధకులు అది క్రీ.పూ.1800 నాటికి చెందినదని తేల్చారట. దురదృష్టవశాత్తూ వార్తని నేను భద్రపఱచలేకపోయాను, దాని ప్రాధాన్యాన్ని అప్పట్లో గుర్తించకపోవడం చేత ! దీన్ని బట్టి ఆలోచిస్తే పాళీభాష యొక్క పౌరాతన్యమే కాక, దానికి మాతృకైన సంస్కృతం యొక్క ప్రాచీనత కూడా పాశ్చాత్యులు చెప్పినదానికంటే ఎన్నో వందల/ వేల సంవత్సరాలు వెనక్కి జఱుగుతున్నట్లు కాదా ?

పాళీభాష ఉత్తరాదిన అన్ని రాష్ట్రాల్లోనూ విస్తారంగా వ్యాపించిన కాలంలో ద్రావిడభాషలు గానీ, ప్రజలు గానీ గోదావరీనదిని దాటిన దాఖలాలు లేవు. ఒకవేళ కొంతమంది ద్రావిడులు ఉత్తరాదిన కూడా ఉండేవారనుకున్నా అక్కడి ప్రజల ఉచ్చారణ అలవాట్లను  ప్రభావితం చేసేటంత కీలక ద్రవ్యరాశి (critical mass) వారి జనాభాకుండేదా ? (సశేషం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి