10, ఏప్రిల్ 2014, గురువారం

లిప్యంతరీకరణ సమస్యలు



లుగుభాష మాత్రమే వచ్చి, తెలుగులిపి మాత్రం రాని తెలుగువారి కోసం కినిగె డాట్ కామ్ గతంలో రోమక లిపి (Roman script) లో వ్రాసిన కొద్ది తెలుగు పుస్తకాల్ని విడుదల చేసింది. అంతకు ముందే లిపిలో వ్రాసిన తెలుగు పదాలు మనకి ప్రాయికంగా దర్శనమిస్తూండడం కద్దు. అంతర్జాలంలోనో, వ్యక్తినామాలుగానో, వంశనామాలుగానో, ఊళ్ళ పేర్లుగానో ! అవి చూసినప్పుడల్లా మనసెక్కడో ఒక మూలన బాధగా మూలుగుతూ అనుభూతిల్లే భావన – “తెలుగు పదాలకి పవిత్రతంటూ ఏమీ లేదా ? వాటిని ఎవఱిష్టమొచ్చినట్లు వారు ఎలా పడితే అలా ఎడా పెడా వ్రాసేయొచ్చునా ? ఇతర భాషాపదాల గుణింతాల పట్లా, ఉచ్చారణా నిర్దుష్టత పట్లా కానవచ్చే భక్తి, వాటిని లిప్యంతరీకరించే సందర్భాల్లో తీసుకునే శ్రద్ధ మన తెలుగుపదాల దగ్గఱికొచ్చేసరికి ఎందుకు మాయమవుతున్నాయి ?” అని !

అశ్రద్ధ మూలాలు 

ఆంగ్లానికి స్పెల్లింగులున్నాయి. తెలుక్కి గుణింతాలున్నాయి. వారి స్పెల్లింగులు వారికెంతో మన గుణింతాలూ మనకంతే కదా ? ఆంధ్రదేశం పరాయిపాలనలో ఉన్న రోజుల్లో మనం నిస్సహాయులం. వారు తమ చిత్తం వచ్చినట్లు మన పదాల్ని ఉచ్చారణలోనూ, వ్రాతలోనూ ఖూనీ చేస్తూంటే మౌనసాక్షుల్లా ఉండిపోవాల్సి వచ్చింది. దరిమిలా విదేశ వ్యామోహపరులుగా మారాక, అవి చాలా ఫ్యాషన్ అనుకుని మనం కూడా విధమైన ఖూనీలోనే గౌరవాన్నీ, దర్జానీ అనుభూతి చెందడం అలవాటు చేసుకున్నాం. అందుచేత అలా ఖూనీ అయిన పదాలకి ఇప్పటికీ పూర్వరూపాల్ని పునస్ సమకూర్చలేదు. పైపెచ్చు అపభ్రంశాలే ఆధికారిక రూపాలుగా చెలామణీలో ఉన్నాయి.

స్వలిపిలో లేని ప్రమాణీకరణ పరాయి లిపిలో సాధ్యమా ? 

బహుశా మన భాష కావాల్సినంతగా ప్రమాణీకృతం (standardized) కాకపోవడం ఒక మౌలిక సమస్య. ప్రమాణీకరణ (standardization) అంటే మనకి గ్రాంథికమే గుర్తుకొస్తుంది. అయితే గ్రాంథికానికే కాదు, వ్యావహారికానిక్కూడా ఒక  సర్వసామాన్యమైన ప్రమాణీకృత స్థాయి ఆవశ్యకం. ప్రాంతీయ అహంకారాలు కేవల మానసికస్థాయిని అధిగమించి చట్టబద్ధ ఆధికారిక ప్రతిపత్తిని సైతం సంతరించుకుని సింహగర్జన చేసే తెలుగునేల మీద, ఎవఱికి వారు తమ ప్రాంతపు మాండలికమే తమకు ప్రామాణికమని వాదించే వాతావరణంలో ఇంగ్లీషు, జర్మన్, రష్యన్ మాదిరి తెలుగులో ప్రమాణీకృత రూపాలు ఏర్పడం కష్టసాధ్యమేమో ననిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రమాణం ఏర్పడాలంటే ముందు ఒక ఏకాభిప్రాయం కావాలి కదా ! ప్రమాణీకృత పదస్వరూపాలు (standardized word forms) లేని భాషని భాషేయులే సరిగా అర్థం చేసుకోరు గనక దాన్ని పరభాషాలిపుల్లో సక్రమంగా ప్రదర్శించడం ఇంకా కష్టతరం.

ఆంగ్లలిపికున్న పరిమితులు

మన శిక్షణలేమితో పాటు లిప్యంతరీకరణకి రోమక లిపి అందించజూపే సౌకర్యాలూ అంతంతమాత్రమే. అయినా మనం గత్యంతరం లేక ఉన్న రోమక వర్ణమాలతోనే బలవంతాన సరిపుచ్చుకుంటూ ఎలాగో పని అయిందనిపిస్తున్నాం. యాభై రెండక్షరాలు గల తెలుగుభాషని అందులో సాబాలు అక్షరాలు మాత్రమే కలిగిన రోమక లిపిలో వ్రాయబూనుకోవడం నిజానికి పూర్తిగా సాధ్యం కాదేమో. ఎందుకంటే లిపులనేవి భాషల కంటే పరమ సంకుచితాలూ, స్థానికాలూను. ప్రతిభాషానిర్మాణంలోనూ ఒక లోతర్కం (inner logic) ఇమిడుంటుంది. లోతర్కాని కనుగుణంగా భాషేయులు తమ లిపిని తీర్చిదిద్దుకుంటారు

ఉదాహరణకి, జర్మన్ లో పదాది అచ్చులన్నింటినీ హ్రస్వాలుగానూ, పదమధ్య అచ్చులన్నింటినీ దీర్ఘాలుగానూ పలుకుతారు. కనుక హ్రస్వదీర్ఘాల్ని విచక్షించి చూపే ప్రత్యేకాక్షరాలు వారికవసరం లేదు. అది వారి భాషలోని లోతర్కం. అఱవంలో పదమధ్య పరుషాలన్నింటినీ సరళాలుగానే పలుకుతారు. కనుక వారికి ప్రత్యేకంగా సరళాక్షరాల్ని కల్పించుకునే అవసరం లేదు. అందుచేత రెంటికీ కలిపి అవే అక్షరాలు వారికి సరిపోతాయి. ఇది వీరి భాషలోని లోతర్కం. కానీ పరభాషాపదాల్ని తమ లిపిలో వ్రాసుకోవాల్సి వస్తే వాటి అసలు ఉచ్చారణని అపభ్రంశించకుండా వారు వ్రాయలేరు. ప్రపంచంలోనే అత్యుత్తమ లిపిగా రెండో స్థానాన్ని ఆక్రమించిన తెలుక్కి అగత్యం అంత స్థాయిలో లేదు. కానీ ఎక్కువ అక్షరాల్ని పలకగలిగిన జాతిగా ఉన్న మనం అదే ప్రావీణ్యాన్ని లిప్యంతరీకరణలో చాటుకోలేకపోతున్నాం , అందులో శిక్షణ కొఱవడడం వల్ల !

మన లిపిలో ఉన్న కొన్ని అచ్చులూ , ఇంకా ఌ ౡ లాంటివీ రోమక లిపిలో లేవని మనకింతకుముందే తెలుసు. అంతే కాక తెలుగక్షరాలతో సారూప్యం కలిగి ఉన్నట్లుగా కనపడే కొన్ని రోమక అక్షరాలు కూడా నిజానికి అలాంటి సారూప్యం గలవి కావు. ఉదాహరణకి, ఆంగ్ల [z] పూర్తిగా మన తాలవ్య జకారం (నెత్తిమీద రెండంకె వేసిన జకారం) తో సరిపోలదు. ఎందుకంటే మనం తాలవ్య జకారాన్ని సుమారుగా dhza అని పలుకుతాం. ఆంగ్ల [z] మన శ్రోత్రకుహరాలకి సకార నిర్విశేషంగా భాసిస్తుంది. అదే విధంగా, ఫకారాన్ని [f] గా లిప్యంతరీకరించేవారున్నారు. ఇందులోని తభావతు ఏంటంటే, మన ఫకారం ఓష్ఠ్యం (labial) కాగా, ఆంగ్ల [f] సకార, హకారాల్లాంటి ఊష్మం [fricative]. ఒకవేళ దాన్ని మూలవిధేయంగా [ph] అని లిప్యంతరీకరించినా సగటు ఆంగ్లేయుడు దాన్ని చూస్తూనే [f] ధ్వనిగా అర్థం చేసుకోకుండా ఆపలేం. అలాగే ఆంగ్ల [t], మన టకారమూ ఒకేలా ధ్వనించే అక్షరాలు కావు. ఎందుకంటే మనం నాలుక కొసని నోటి పైభాగానికి తాడించి టకారాన్ని పలుకుతాం. ఆంగ్లేయులేమో దాన్ని దంతపంక్తి యొక్క వెనకచిగుళ్ళకు తాడించి పలుకుతారు. డకారం పరిస్థితి కూడా అంతే !  

అలాగే మన అనుస్వారానికి ఆంగ్ల [m], [n] లు అన్నివేళలా ప్రత్యామ్నాయం కావు. (అయితే అన్ని అనునాసికాల పొల్లులకీ అనుస్వారమే వాడడం కూడా శాస్త్రీయం కాదని అభిప్రాయపడేవారున్నారనుకోండి. అది వేఱే విషయం) అలాగే ఆంగ్లం, ఆంధ్రం - రెండు భాషల్లోనూ మేషస్వరం (Bank, తాటాకులాంటి పదాల్లో ఉన్న అచ్చు) ఉన్నప్పటికీదాన్ని సూచించే లిపిచిహ్నం మాత్రం చిత్రంగా రెండిట్లోనూ కఱువే. ఫలితార్థంగా స్వరం గల తెలుగుపదాల్ని రోమక లిపిలో వ్రాయాల్సివస్తే అపోచ్చారణ తలెత్తకుండా ఎలా లిప్యంతరీకరించాలనేది మఱో శిరోవేదన. ఔత్తరాహుల ప్రభావం చేతా, వారి పేర్లే మనమూ పెట్టుకోవడం చేతా మనకి అదనంగా సంక్రమించిన ఇంకో అయోమయం - మెలిక ని ఏమని లిప్యంతరీకరించాలి ? అనేది.  ఔత్తరాహులు దాన్ని [] అని పలుకుతారు. మనం దాన్ని అర్ధ మేషస్వరంతో [స్య] అని పలుకుతాం. నిజానికి దాన్ని ఇటు పూర్తిగా సకారంలానూ కాకుండా, అలాగని అటు పూర్తిగా షకారంలానూ కాకుండా మధ్యస్థంగా ఈలవేసిన ధ్వనితో పలకాలి. [] అని పలికే వారికి దాన్ని ఆంగ్లంలో[sha] అని వ్రాసేయడం సులభం. అసలది షకారమే కాదని తెలిసిన మనలాంటివారికి అలా వ్రాయాలంటే మానసిక అవరోధాలెదురవుతాయి. కనుక పాఠ్యాల్ని కూర్చేటప్పుడు [sha] కి బదులు [hsa]  అనే వర్ణసమ్మేళనాన్ని ఉపయోగించే ప్రతిపాదన అభిజ్ఞులకు పరిశీలనార్హం.      
(సశేషం)            

1 కామెంట్‌: