17, ఏప్రిల్ 2014, గురువారం

ళకార మీమాంస-3



లౌకిక సంస్కృతంలో ళకారపు జాడలు
కొందఱు మధ్యేమార్గవాదులున్నారు. సంస్కృతంలో స్వతహాగా ళకారం ఉందనీ, అది ఏ ఇతరభాషాప్రభావమూ కాదనీ అంగీకరిస్తారు. కానీ అది వేదవాఙ్మయంలోనే తప్ప లౌకిక సంస్కృతంలో మాత్రం లేదంటారు. ఈ అభిప్రాయం కూడా సరికాదని నా ఉద్దేశం. ఇది కొంతవఱకూ లౌకిక సంస్కృతం అనే మాటకి మనమిచ్చుకునే నిర్వచనాన్ని బట్టి కూడా ఉంటుంది. ఆ మాటకర్థం పాణిని వ్యాకరణానుసారం కవులు రచించిన సారస్వత గ్రంథాలే అయితే వారి వాదన పాక్షికంగా సత్యం. కానీ నా దృష్టిలో లౌకిక వాఙ్మయమనే మాటకున్న వ్యాప్తి ఇంకొంత నిడుపైనది. లిఖితరూపాన్నే కాక భాషిత రూపాన్ని కూడా లౌకిక సంస్కృతంగా భావించాల్సి ఉంటుంది. భాషిత సంస్కృతం అంతకు పూర్వరూపమైన వైదిక సంస్కృతం నుంచి పరిణమించినదేనని ఒప్పుకునేందుకు ఎవఱికీ అభ్యంతరం ఉండదనుకుంటాను. ఆ వైదిక సంస్కృతంలో ళకారం ఉందనే సత్యాన్ని ఇంతకు ముందే స్థాపించడమైనది. దాని తదనంతర రూపమైన భాషిత సంస్కృతంలో కూడా ళకారం ఉండే ఉండాలి. లేకపోతే దానికి తదనంతర రూపమైన పాళీ ఇత్యాది ప్రాకృతాల్లో అది విధిగా దర్శనమివ్వడం జఱగదు. ముందూ ఉంది. వెనకా ఉందీ. కానీ ఆ మధ్యలోనే లేదుఅని వాదిస్తే ఆ వాదన నమ్మశక్యంగా ఉండదు.
కనుక లౌకిక సంస్కృతంలో కూడా ఒకప్పుడు ళకార ప్రయోగం ప్రచురంగా ఉండేదనీ, దాన్ని వ్రాతలోనూ ప్రదర్శించేవారనీ స్పష్టమవుతోంది. అటువంటప్పుడు ఏయే పదాలు మొదట్లో ళకారాన్ని కలిగి ఉండి తదుపరి సాధారణ లకార పదాలుగా పరిణమించి ఉండొచ్చు ?” అనే విచికిత్స అనివార్యంగా తలెత్తుతుంది.
ఒకవైపు ళకార పదాలన్నింటినీ నిశ్శేషంగా లకార పదాలుగా రూపుమార్చేసిన ఈ పరిస్థితుల్లో, మఱో వైపు కేవలం దాక్షిణాత్యులమనే ప్రాంతీయ నెపం పెట్టి మన ళకార పదాల్ని ళకార పదాలుగా అంగీకరించని అవిశ్వాస వాతావరణంలో పై విచికిత్సకి సమాధానాలు పట్టుకోవడం ఇంచుక కష్టమే. కానీ పూర్తిగా అసాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకి - ఒక భాషలో ఒక అక్షరం ఉందీ అంటే దానర్థం ఆ భాషకోసం అది ఓ అర్థవంతమైన ప్రయోజనాన్ని నెఱవేఱుస్తోందని ! ఆ ప్రయోజనం నెఱవేఱుస్తున్నంత కాలమూ అది ఆ భాషలో కొనసాగుతుంది. అక్షరాలైనా, పదాలైనా నెఱవేర్చే ప్రధాన ప్రయోజనం ఒక ప్రత్యేకమైన అర్థాన్ని బోధించడం. ధ్వనిభేదం ద్వారా ఒక శబ్దార్థం నుంచి మఱో శబ్దార్థాన్ని విచక్షించి చూపడం. దీనికే అర్థభేదకత అని పేరు. ఉదాహరణకి తెలుగులో కకార, గకారాలకి ఎక్కువ సందర్భాల్లో అర్థభేదకత ఉంది. అంటే ఆయా పదాల్లో కకారం  బదులు గకారాన్ని వ్రాసినా, లేదా గకారం బదులు కకారం వ్రాసినా అర్థం మారిపోతుంది. కాబట్టి అలా అర్థభేదాన్ని చూపిస్తున్నంత కాలం ఆ రెండూ భాషలో కొనసాగుతాయి. అంతకాలమూ ఆ రెంటిలో ఒకటే మిగిలి రెండోది కనుమఱుగు కావడం జఱగదు. ఉదాహరణకి-
కజ్జికాయలు, గజ్జికాయలు
కట్టు, గట్టు
కంప, గంప
మునక, మునగ
బొక్కు, బొగ్గు ఇత్యాది||
ఒకవేళ ఏ కారణం చేతనైనా ఈ రెండక్షరాల్లో ఏదో ఒకటే భాషలో మిగిలి రెండోది కాలగర్భంలో కలిసిపోతే అప్పుడేమవుతుంది ? అప్పుడు రెండు పదాలూ, వాటి అర్థాలూ ఒకే పదంలో సర్దుకుంటాయి. ఎందుకంటే అక్షరాలు మారినంత మాత్రాన పదాలూ, వాటి అర్థాలూ అంతరించవు. అప్పుడు నిఘంటువుల్లో ఆయా పదాలకు ద్వంద్వార్థాలివ్వసాగుతారు. గతంలోనూ ఇలా చాలాసార్లు జఱక్కపోలేదు. ఉదాహరణకి, వ్యావహారికవాదులు శకటరేఫని బహిష్కరించాక అది గల పదాలన్నీ సాధారణరేఫ గల పదాల్లో విలీనమయ్యాయి. వాటినిప్పుడు రెండర్థాల్లో బోధపఱచుకోవాల్సిన అగత్యం తలెత్తింది. ఈ పరిణామాన్ని లయప్రతిక్షేపం అనవచ్చు.
వేఱు భిన్నమైనది ; వేరు వృక్షమూలం. 
దూఱు నిందించు ; దూరు ఒక ఇఱుకు ద్వారంలో/ లేదా మార్గంలో ప్రవేశించు.
కోఱు కోఱమనే సాధనంతో కురిడిలోని పచ్చికొబ్బరిని లౌజుగా గొఱిగి తీయడం ; కోరు కాంక్షించు.
ముఱుగు ముఱికినీరు ; మురుగు చేతి కడియం.
చెఱుగు చెఱిగిపోవు ; చెరుగు - పప్పుల నుంచి పొట్టుని వేఱుచేయు.
కోఱ వాడియైన పన్ను ; కోర గిన్నె.
దరిమిలా, “ఒకే పదానికి ఇలా బొత్తిగా సంబంధం లేని నానార్థాలు ఎందుకేర్పడతాయో?” అని భావితరాలు విస్తుపోతారు. లకారళకార పదాల విషయంలో అదే జఱిగింది. అయితే పైన చూపించినంత నేరుగా జఱిగినట్లు కనిపించదు. మొదట డకార పదాలు కొన్ని ళకార పదాలుగా మారగా, మళ్ళీ ఆ ళకార పదాల్నే లకార పదాలుగా వ్రాసుకోవడం జఱిగింది. అలా పెక్కు డకార పదాలూ, ళకార పదాలూ అంతిమంగా లకార పదజాలంలో లయించిపోయాయి. దరిమిలా వాటిల్లో కొన్నింటికి పూర్తి విరుద్ధమైన నానార్థాలేర్పడ్డాయి. ఇందుకో స్ఫుటమైన మచ్చుతునక జల శబ్దం. దీనికి జడమ్అనే పూర్వరూపం ఉన్నట్లు వివిధ నిఘంటువులు సాక్ష్యమిస్తున్నాయి. ఉదాహరణకు, Theodore Benfey కూర్చిన A Sanskrit-English Dictionary లో రెండురూపాలూ ఇస్తూ ఆ పదాన్ని ఇలా నిర్వచించారు:  
జల jala (cf. jaa) I.n. 1. Water, Man.4, 46.....n. Frost, hoarfrost, dew. Sa-, adj. Humid, Megh.23.
(A Sanskrit-English Dictionary 1866, Asian Educational Services, New Delhi వారి పునర్ముద్రణ 1991)

అదే విధంగా కిట్టెల్ పండితుడు (Ferdinand Kittel) కూర్చిన Kannada-English నిఘంటువులో ఇదే పదానికి రెండు రూపాలూ ఇస్తూ దాన్ని ఇలా నిర్వచించాడు.
151. JALA, JADA. Cold, frigid, chilly ; Cold, frost, winter
(A Kannada-English Dictionary, 1894, Asian Educational Services వారి పునర్ముద్రణ 2006) 

(ముగింపు వచ్చే టపాలో....)

1 కామెంట్‌: