4, మే 2014, ఆదివారం

తెలుగులో మేషస్వరం-3 (సమాప్తం)


శేషణాల్లో మేషస్వరం :- నామవాచకాల్లో ప్రవర్తించే ధ్వనిసూత్రమే దీని పలుకుబడికీ వర్తిస్తుంది. ఉదాహరణకి-
పేద్ద = ప్యాద్ద (వ్యంగ్య పరిహాసార్థంలో)
కేవలం క్యావలం
పేలవం ప్యాలవం
తేరగా త్యారగా
బేలగా బ్యాలగా
అసమాపక క్రియల్లో మేషస్వరం :- ఇది చాలావఱకూ నామవాచక, విశేషణాల్లో లాగానే. ఉదాహరణకి-
లేకపోతే ల్యాకపోతే
తేకుండా త్యాకుండా మొ||
సంహిత రూపాల్లో మేషస్వరం :– సంహితంఅంటే సంధి కుదిఱిన శబ్దయుగ్మం. ఉదాహరణకి తాటి + ఆకు = తాటాకు. ఇలా ఇకార, ఆకారాలకి సంధి కుదిఱిన పట్టులలో ఆ రెండచ్చుల స్థానే మేషస్వరం ఆదేశమవుతుంది. కనుక సంహితరూపంలోని టా’ వర్ణాన్ని మేషస్వరంగా ఉచ్చరించాలి.
ఒకవేళ పరపదం యొక్క ఆదివర్ణం హ్రస్వ అకారమైతే హ్రస్వ మేషస్వరమే ఆదేశమవుతుంది. ఉదాహరణకి మణి + అమ్మ = మణెమ్మ. ఇక్కడ ణెలో ఉన్నది ఎకారం కాదు. హ్రస్వ మేషస్వరమేనని గమనించాలి. కానీ మామూలు ఎత్వానికీ, దానికీ మధ్య గల వ్యత్యాసం స్పష్టాస్పష్టం కనుక దాని కోసం ప్రత్యేకంగా ఒక సూత్రమూ, లిపిచిహ్నమూ అవసరం లేదనే విషయాన్ని ఇంతకు ముందే చెప్పడమైనది. మణెమ్మలాంటి మఱో మచ్చుతునక మల్లి+అంటు = మల్లెంటు. మొండెబ్బాయి ఇత్యాదులు కూడా ఇదే కోవలోకి వస్తాయి.
మఱికొన్ని ఉదాహరణలు :-
చూడి + ఆవు = చూడ్యావు
పాడి + ఆవు = పాడ్యావు
ఇంటి + ఆవిడ = ఇంట్యావిడ
పేడి + ఆయన = పేడ్యాయన
తొండి + ఆట = తొండ్యాట
పిల్లి + ఆచారాలు = పిల్ల్యాచారాలు
అపవాదాలు :- ముసలి + ఆయన = ముసలాయన
మావిడి + ఆకు = మావిడాకు
బచ్చలి + ఆకు = బచ్చలాకు మొ||
ప్రశ్నార్థకాల్లో మేషస్వరం :- ఇతర ద్రావిడ భాషల్లో లాగే తెలుగులో కూడా స్పందనాపేక్షక ప్రశ్నార్థక వాక్యాలు సర్వసాధారణంగా అనే అంచలం (tag) తో అంతమవుతాయి. స్పందనాపేక్షకాలంటే అవుననో కాదనో లేదనో సమాధానాన్ని అపేక్షించే ప్రశ్నలు. ఉదాహరణకి- మీరు అక్కడికి వెళ్ళారా ? ప్రసాద్ గారంటే మీరేనా ? నేనన్నది అది కాదు గదా ? ఇత్యాదులు. ఈ విధమైన ఆకారాంచలానికి ముందొచ్చే పూర్వపదం ఇకారాంతమైతే అలాంటి ప్రశ్నార్థకంలోని ఆకారానికి మేషస్వరం ఆదేశమవుతుంది. ఉదాహరణకి, ఒకటి + ఆ ?  = ఒకట్యా ?
మఱికొన్ని ఉదాహరణలు :-
ఆ అమ్మాయి ఇంకా చదువుకుంటోంద్యా ?
మీ స్వగ్రామం బండారుపల్ల్యా ?
నీ ఉద్దేశం ఏంటి, నేనలా చెయ్యకూడదనా ?
ఇంకాస్త వడ్డించాల్యా ? (ఈ తెఱగు క్రియాపదాల్లో మాత్రం మేషస్వరాదేశం వైకల్పికం)
వాళ్ళకేమైనా పిచ్చ్యా ? మొ||
ఆధునికాంధ్రంలో మేషస్వరపు టునికి ఓ ఖరాఖండీ వాస్తవం. చాలా సార్లు మన భాషలో ఈ మేషస్వరోచ్చారణ వినపడడం వల్లే “మొదటి పదం అంతమవుతున్నది ఇకారంతోనా ? మఱో అచ్చుతోనా ?” అనేది స్థానిక వ్యవహర్తలు సక్రమంగా గుర్తుపట్టుతారు. అంటే వాడుకతెలుగు సరిగా అర్థం కావాలంటే మేషస్వరానికి వర్తించే నియమాల పరిజ్ఞానం ఆవశ్యకమని తెలుస్తోంది. ఉదాహరణకి బండి + ఆయన అనే సంహితరూపాన్ని మేషస్వరోచ్చారణతో మార్పు చేయకుండా నేరుగా “బండాయన” అని త్త్వసంధి చేసి పలికితే అది శ్రోతలకి బండవాడు అనే అర్థాన్నిస్తుంది.
 (సమాప్తం)

3 కామెంట్‌లు:

  1. అయ్యా, నమస్కారములు!

    తమరికి నా (నా తెలంగాణ కోటి రత్నాల వీణ యందలి) పద్య శైలి నచ్చినందుకు ధన్యుడను. నేను రాజకీయేతరాంశాలపై
    కవిత్వం రాసే బ్లాగు మరొకటి ఉన్నది. అది "మధుర కవనం". దాని లింకును ఈ
    దిగువ నిచ్చుచున్నాను. దయతో వీక్షించి, అభిప్రాయం తెలుపగలరు.

    మధుర కవనం...www.madhurakavanam.blogspot.in
    (లేదా...ఈ బ్లాగులోనే...నా మరోబ్లాగు శీర్షికన "మధుర కవనం" అని వ్రాసి ఉన్నదానిపై క్లిక్ చేయగలరు.

    తమరు చేయుచున్న భాషాసేవ ప్రశంసనీయము. అభినందనలు!

    ధన్యవాదములతో,
    భవదీయుడు,
    గుండు మధుసూదన్

    రిప్లయితొలగించండి
  2. ఆర్యా ! నమస్కారములు. తప్పకుండా చూస్తాను. మీవంటి విద్వత్కవుల పరిచయం కలగడం నా భాగధేయమని భావిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  3. ఆర్యా .. మీరు తాలబాసు గారా?
    వేరే ప్రత్యామ్నాయం లేదు .. మీరే మీరే ..

    ఎన్నాళ్లకెన్నాళ్ళకి ..ఎన్నాళ్ళకెన్నాళ్ళకి. ఇది కలా నిజమా

    రిప్లయితొలగించండి