16, ఏప్రిల్ 2014, బుధవారం

ళకార మీమాంస-2



పాళీభాషతో పాటు ళకారం కూడా అతిప్రాచీనమైనంత మాత్రాన అది సంస్కృతంలో కూడా ఉన్నట్లు విధంగా నిరూపణ అవుతుంది ?
అంశానికే వస్తున్నాను. ళకారం సంస్కృతానికి చెందదనేందుకు ళాభావవాదులు చెప్పే యుక్తుల్లో ఒకటి – “సంస్కృతంలో దాని ప్రవేశం బహుశా ద్రావిడభాషల ప్రభావం మూలాన అనేది. సూక్ష్మంగా పరిశీలిస్తే వాదం కూడా కొంతవఱకూ చరిత్రతేదీల్ని మార్చడం వల్ల- లేదా మార్చబడ్డ తేదీల దృష్టిలోంచి చారిత్రిక పరిణామాల క్రమాన్ని అపార్థం చేసుకోవడం చేత ఉప్పతిల్లినదే. ఎందుకంటే సాక్షాత్తూ వేదసాహిత్యంలోనే ళకారం తఱచుగా దర్శనమిస్తోంది. వేదరచననీ, మూలద్రావిడాన్నీ సమకాలీన అంశాలుగా చూడడం వల్ల కలిగిన మనోభ్రమే పైవాదం. నిజానికి అవి వేఱువేఱు కాలాలకు చెందినవి. సంస్కృతభాష లోకవ్యవహారంలోంచి తొలగిపోయి ప్రాకృతాలుగా విడిపోయిన కాలానికి (క్రీ.పూ.1000) చెందినది మూలద్రావిడం. అందుచేత ఒక జీవద్భాష ఒక మృతభాషనీ, అందులోని తొలుదొల్తటి సాహిత్యాన్నీ ప్రభావితం చేసే ప్రశ్నే ఉదయించదు. వేదరచనాకాలం క్రీ.పూ.1500 అంటూ పాశ్చాత్యులు వేసిన పొఱపాటులెక్కల్ని బట్టి చూచినా ద్రావిడప్రభావ వాదం పొసగదు.
ఈనాడు ద్రావిడభాషల కుపయోగిస్తున్న లిపులు ఉత్తరాదిన ఉద్భవించిన బ్రాహ్మీమూలకాలు. బ్రాహ్మీలిపిలో స్వతహాగా ళకారం లేకపోతే ఆ చిహ్నం ద్రావిడ లిపుల్లో ఎలా ప్రవేశించింది ? స్థానికంగా రూపొందించారా ? కాదు, ఉత్తరాది బ్రాహ్మిలోనే అది ఉందనుకుంటే తమ భాషలో లేని ధ్వనికోసం ఉత్తరాదివారు అంత శ్రమ తీసుకుంటారా ? ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభించనప్పుడు పాళిలోని ళకారం కూడా ద్రావిడప్రభావ మూలకమేనని వాదించడం పిడివాదమవుతుందే తప్ప, మనకు తెలిసి అప్పటికింకా సాహిత్యస్థాయిని కూడా అందుకోని (లిపి కూడా లేని) ద్రావిడభాషలకు అంత స్తోమత ఉన్నట్లు కనిపించదు. దక్షిణాది లిపుల్లోని ళకారం స్థానికంగా రూపొందించినది కాదనడానికి దానికీ దేవనాగరీ ళకార చిహ్నానికీ ఉన్న పోలికలే నిదర్శనం. దేవనాగరిలోని కకారాన్ని పడుకోబెడితే అది తెలుగు కకారం అవుతుంది. అదే విధంగా దేవనాగరీ ళకారాన్ని నిలబెడితే అది తెలుగు ళకారం అవుతుంది. ఈ పోలికలు కేవలం యాదృచ్ఛికమేనని సరిపెట్టుకుందామా ?

5. వేదాల మీద ద్రావిడప్రభావం ?
ళాభావవాదులు వాదాన్ని లేవనెత్తడం ద్వారా సాక్షాత్తూ వేదాల మీదే ద్రావిడప్రభావం ఉందంటున్నారన్నమాట. “కేవలం ళకారం విషయంలోనే వేదాల మీద ద్రావిడప్రభావం ఎందుకుంది ? మిహతా విషయాల్లో ఎందుకు లేదు ?” అని అడిగితే మాత్రం సమాధానం లేదు. అంతే కాదు, ళకారం అచ్చంగా ద్రావిడభాషల సొత్తనీ, మఱే ఇతర భాషాకుటుంబంలోనూ అది ఉండడానికి సుతరామూ వీల్లేదనీ తామొక పూర్వాభిప్రాయాన్ని ఏర్పఱచుకొని దాని కనుగుణంగా యుక్తులు చెబుతున్నారు. నిజానికి ళకారం దాక్షిణాత్య భాషల్లోనే కాక థాయ్, ఖ్మేర్, బర్మీస్ వంటి తూర్పాసియా భాషల్లో కూడా ఉంది. అయితే బౌద్ధ మతభాష అయిన పాళి ప్రభావం పడి అక్షరం ఆయా భాషల్లో చోటు సంపాదించుకుందని వాదించడానికీ అవకాశం లేకపోలేదు. అయితే సంస్కృతం విషయంలో ద్రావిడప్రభావం మూలానఅని చెప్పుకుంటూ, వారి విషయంలో మాత్రం పాళీప్రభావమని మడతపేచీ పెట్టడం సరికాదు.  
ఋగ్వేదంలోని మొట్టమొదటి మంత్రంలోనే ళకారోచ్చారణ ఉందని నేను చెప్పినప్పుడు, “తిరుమల-తిరుపతి దేవస్థానంవారు ముద్రించిన వేదసంపుటంలో డకార పాఠమే ఉందని మిత్రులొకఱు అన్నారు. నేనా సంపుటం చూశాను కాను. కానీ అంతకు ముందు ఇతరులు ముద్రించగా నేను చూసిన అనేక వేదసంపుటాల్లో డకార పాఠం లేదనీ, కేవలం ళకార పాఠాలే ఉన్నాయనీ నమ్మకంగా నొక్కి వక్కాణించగలను. వేదానికి భాష్యం వ్రాసిన సాయణాచార్యుడు ళకార పాఠం గుఱించి వ్యాఖ్యానించాడు కూడాను. అది క్రింది విధంగా ఉంది.
మంత్రం : ఓమ్ అగ్నిమీళే పురోహితమ్ యజ్ఞస్య దేవమృత్విజమ్ | హోతారం రత్నధాతమమ్ |
దీని పదవిభాగం తరువాత ఉన్న సాయణభాష్యం :- అగ్నినామకం దేవమ్ | ఈళే-స్తౌమి | ఈడ-స్తుతౌ ఇతి ధాతుః | డకారస్య ళకారో బహ్వృచాధ్యేతృ సంప్రదాయప్రాప్తః | తథా పఠ్యతే – “అజ్మధ్యస్థ డకారస్య ళకారం బహ్వృచా జగుః, అజ్మధ్యస్థ ఢకారస్య ళ్హకారం వై యథాక్రమమ్ఇతి |
(భాష్యతాత్పర్యం :- అగ్ని అనే పేరు గల వేల్పును పొగుడుతున్నాను. ఈడస్తుతౌ అని ధాతువు. డకారం బదులు ళకారం వాడడం ఋగ్వేద విద్యార్థుల సంప్రదాయం నుంచి వచ్చింది. విషయమే ఇలా చెప్పారు – “రెండచ్చుల మధ్య ఉన్న డకారానికి ళకారం ఆదేశమవుతుందని ఋగ్వేదపండితులు అంటారు. అదే క్రమంలో రెండచ్చుల మధ్య ఉన్న ఢకారానికి ళ్హకారం ఆదేశమవుతుంది)
అంటే ఇక్కడ శ్రీ సాయణాచార్యులు ఒక వ్యాకరణ నియమాన్ని ప్రస్తావిస్తున్నారు. నియమానుసారమే సదరు మంత్రంలో ప్రయోగించిన ఈడఅనే ధాతువులోని డకారానికి ళకారం ఆదేశమైందని వాక్రుచ్చారు. అంటే ళకారం సంస్కృత వ్యాకరణ సంప్రదాయంలో భాగమని సిద్ధిస్తోంది. పాళీభాషలో పాటించే నియమం కూడా సరిగ్గా ఇదే కావడం ఆసక్తికరం. ఇతర భాషల నుంచి అప్పుతెచ్చుకుని పలికే అక్షరాల విషయంలో ఒక భాషాప్రజలు వ్యాకరణ నియమాలేర్పఱచుకోవడం అరుదు. మన తెలుగు వ్యాకరణాల్లో [f, q, w] లాంటి క్షరాల నిమిత్తం ఎలాగైతే నియమాలూ పేర్కొనబడవో ఇదీ అంతే. కవేళ ఏర్పఱచుకోవాల్సి వస్తే అక్షరాలు విదేశ్యపదాల్లో భాగమో ఆదాన పదాలకు సంబంధించి మాత్రమే ఏర్పఱచుకుంటారు తప్ప దాన్ని తమ దేశిపదాలకు అనువర్తించుకోరు. కనుక ళకారం అచ్చంగా సంస్కృతానికి దేశివర్ణమని తేలుతోంది. చిత్రమేంటంటే, ళాభావవాదులు ళకారమైతే ద్రావిడ మూలకమని వాదిస్తున్నారో దానికి సంబంధించి ద్రావిడభాషల్లో ఇలాంటి నియమాలేవీ లేకపోవడం.
6. త్తరాది భాషలు ళకారాన్ని కోల్పోయిన వైనం
() ళాభావవాదులు పేర్కొనే మఱో యుక్తి -  లౌకిక సంస్కృతంలో కూడా పదాలకీ, సాహిత్యానికీ గల ళకార పాఠాలు వింధ్యపర్వతాలకి ఇవతలే లభిస్తున్నాయి తప్ప అవతల ఆర్యావర్తంలో ళకార పాఠాల ప్రసక్తే లేదు. కానీ వింధ్యకు అవతల ఉన్న జనాభాయే విస్తారం. కనుక వారి పాఠాలే ప్రామాణికం. మనవి కావు.
సంస్కృతంలో ళకారం లేదనే అపోహ విస్తారంగా వ్యాపించిపోవడానికి ప్రధాన కారణమిది. ఇది కూడా - సంస్కృతం ఉత్తరాదిభాష అనీ, ఆర్యభాష అనీ, అందుచేత దాని మీద సాధికారంగా మాట్లాడే యోగ్యత ఔత్తరాహులదేననే అప్రకటిత భావన ప్రబలినాక తలెత్తినదే. ఈ విధంగా ఎప్పుడైతే మన భావనాలోకంలో సంస్కృతం ఉత్తరాదిభాష అయిందో అప్పుడే ళకారం కూడా ద్రావిడభాషల గుత్తసొత్తయింది. ఈ భావన సమీచీనం కాదు. మన పూర్వీకులలో ఈ భావనలు లేవు. ఉన్న పరిస్థితుల్లో సంస్కృతం అందఱికీ చెందుతుంది. లేదా ప్రత్యేకంగా ఎవఱికీ చెందదు. ఎందుకంటే ఔత్తరాహులక్కూడా ఈ రోజున అది మాతృభాష కాదు. అదీ గాక ఏ ఉత్తరాదిభాషలోనూ ళకారం లేదనడం కూడా సరికాదు. భాషాశాస్త్రపరంగా ఉత్తరాదికే చెందిన మరాఠీలో ళకారం విస్తారంగా ఉంది. దాన్ని వారు లిపిలోనే కాక అనేక దేశి మరాఠీపదాల్ని ఉచ్చరించడానిక్కూడా వాడతారు.
ఉత్తర భారతదేశం గడిచిన సహస్రాబ్దికాలంగా అనేక విదేశీ దండయాత్రలకు బలైంది. సాంస్కృతిక దాడులకు గుఱైంది. ఫలితార్థంగా సంస్కృతిలో ఓ అవిభాజ్య అంగమైన భాష కూడా దురభిజ్ఞమైన మార్పులకు లోనైంది. ఎంతగా అంటేతొలిసారి హిందూస్తానీ భాష విన్నవారెవఱూ అది సంస్కృత జన్యమంటే నమ్మలేరు. మన దగ్గఱ ఇటీవలి దాకా దానికి మహ్మదీయుల భాషగానే గుర్తింపు. ఆ మార్పులు అక్కడి లేఖన సంప్రదాయాలలో ప్రతిఫలించడం సహజం. ఆ క్రమంలో- విదేశీ ఆక్రామకులు దేశం మీద విధించిన అధికారభాషల్లో లేని ళకారం స్వదేశీయుల ఉచ్చారణలోంచి కూడా తొలగిపోవడం మొదలై ఉండవచ్చు. అంతిమంగా అది తమ లిపిలోంచే అదృశ్యమైంది. భాష అనేది ఒక తరం నుంచి మఱో తరం వినికిడి ద్వారా తెలుసుకుని ఎప్పటికప్పుడు ఉచ్చారణలో ఉజ్జీవింపజేయాల్సినటువంటిది. ళకార విషయికంగా అటువంటి గురుజనోపదేశ పరంపరా తంతువు ఏదో ఒక దశలో పూర్తిగా వ్యవచ్ఛిన్నమై ఉండవచ్చు. దాన్ని ఎలా పలకాలో మర్చిపోయిన తదుపరి తరాలు దాన్నొక అనావశ్యక వర్ణంగా భావించి దాని స్థానంలో సాధారణ లకారాన్ని ప్రతిక్షేపించి వ్రాసుకోసాగారు. దరిమిలా సంస్కృతంలో ళకారం లేదనే భావన లోతుగా పాదుకోవడమే కాక ళకార సహిత సంస్కృత శబ్దాల ప్రయోగాన్ని అక్షర దోషాల్లా చూడడం, ఆక్షేపించడం కూడా మొదలయ్యాయి.

ఇహపోతే ఉత్తరాదివారి జనాభా మనకంటే ఎక్కువ గనుక వారి ళకార విరహిత పాఠాలే ప్రమాణమనే వాదన. రాజకీయాల్లో మాదిరి జనాభా ఆధిక్యాన్ని బట్టి భాషాసారస్వతాల నిర్దుష్టతల్ని నిర్ణయించడం సాధ్యమేనా ? ఒకనాడు విస్తారంగా వాడుకలో ఉన్న అక్షరాలూ, పదాలూ అంతే విస్తారంగా మఱపుకొచ్చి చెదుఱుమదుఱుగా కొద్ది ప్రాంతాలకే పరిమితమయ్యే ఉదంతాలు భాషాశాస్త్రంలో కోకొల్లలు. అలాంటి ప్రాంతాలకు Relic areas (అవశేష ప్రాంతాలు) అని పేరు. ళకార విషయికంగా దక్షిణాపథం అటువంటి Relic area. అంతమాత్రాన అది మిహతా భారతదేశంలో ఎప్పుడూ ఎక్కడా వాడుకలో లేదని వాదించడం సబబేనా ? చారిత్రిక అంశాల్ని వర్తమాన వాస్తవాల ఆధారంగా నిర్ణయించడం శాస్త్రీయం అనిపించుకుంటుందా ? (సశేషం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి