9, ఏప్రిల్ 2014, బుధవారం

శకటరేఫ ప్రయోగాన్ని పునరుద్ధరించాలిరత ఉపఖండంలో ద్రావిడభాషలకే ప్రత్యేకమైన అక్షరం బండిఱా. దీనికే శకటరేఫ అని పేరు. అది బండిఱా అనే మాటకే సంస్కృతానువాదం. ఎందుకంటే సంస్కృతంలో బండిఱా లేదు. సాధారణ రేఫే (కారమే) ఉంది. అందువల్ల ఆ భాషలో బండిఱా ని ధ్వనిరూపంలో గానీ, వర్ణనాత్మకంగా గానీ స్ఫురింపజేయగల సౌలభ్యం లేదు.

 

శకటరేఫకీ, సాధారణ రేఫకీ నడుమ తేడా ఏంటి ?


నిజం చెప్పాలంటే, ఉచ్చారణలో రెంటికీ చాలా తేడా ఉంది, అదేంటనేది ఈనాడు మన తెలుగు ఉపాధ్యాయులు మనకి పాఠశాలల్లో తాము పలికి, మనచేత పలికించి నేర్పకపోయినా ! అసలు ఈ ప్రశ్న వేయాల్సిన అగత్యం ఏర్పడుతోందంటేనే దానర్థం - వివిధరేఫల మధ్య గల ఉచ్చారణ అంతరాలు ఆచరణాత్మకంగా అంతరించాయనీ, ప్రజలు అన్ని రేఫల్నీ ఒకేలా పలుకుతున్నారనిన్నీ ! అయితే ఈ సందర్భంగా ఒక విషయం. భాషంటే పూర్తిగా పాఠశాలల్లోనే కూర్చుని నేర్చుకోవాల్సినది కాదు. ఎందుకంటే ప్రాథమికంగా భాష అంటే మాట్లాడడం. అది ఇంట్లోనే మొదలవుతుంది. సాధారణంగా మన పెద్దలు ఏ అక్షరాలు పలకగలరో వారి దగ్గఱ భాష నేర్చుకున్న మనమూ అవే అక్షరాలు పలకగలుగుతాం. మన పెద్దలు పలకలేనివి పాఠశాలలో చేఱి గురుముఖతః నేర్చుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆ గురువులకే కొన్ని అక్షరాలు పలకడం రాకపోతే ? రేఫల విషయంలో మన అయోమయానికి కారణం ఇదే. మన గురువులకే వాటి మధ్య వ్యత్యాసమేంటనేది తెలీదు. కాబట్టి మనకీ తెలీదు. ఎందుకంటే మన గురువుల గురువులకీ, వారి ఇంట్లోని పెద్దలక్కూడా అది తెలీదు.

సాధారణ రేఫని ఇంగ్లీషులో Father, Mother లాంటి పదాల చివఱ వచ్చే [r] ని పలికినట్లు (ఫాద*, మద*) అని అస్పష్టంగా తేల్చిపలకాలి. ఉత్తర భారతీయులు ఇప్పటికీ ఇలాగే పలుకుతారు. కావాలంటే హిందీపాటల్లో పదాంత రేఫపొల్లు ఉచ్చారణని గమనించవలసినది. దక్షిణ భారతీయులు మాత్రమే దాన్ని చాలా స్పష్టంగా పలుకుతారు. కానీ అది సరికాదు. సంస్కృతంలో వచ్చే సాధారణ రేఫని కూడా అలాగే తేల్చిపలకాలి తప్ప స్పష్టంగా పలక్కూడదు. శకటరేఫని స్పష్టంగా గుఱ్ఱం అని పలికినట్లు పలకాలి.  కానీ మనం నియమానికి వ్యతిరేకంగా చేస్తూ అదే సాధువనుకుంటున్నాం. అంటే ఈ 21 వ శతాబ్దపు తెలుగులో మనం సర్వేసర్వత్రా వాస్తవంగా అనుదినమూ పలుకుతున్నది బండిఱానే. కానీ వ్రాతలో చూపిస్తున్నదేమో ఇండో-యూరోపియన్ రేఫ (సాధారణ రేఫ) నన్నమాట !     

ఈ తేడా ఎందుకని తెలియకుండా పోయింది ?


ఈ తెలియకుండా పోవడం అనేది మొదట్నుంచీ లేదు. మధ్యలో ప్రవేశించింది. ఆంధ్ర చ్ఛందశ్శాస్త్రాలు పేర్కొనే యతిప్రాసల నియమాల్ని పరిశీలించినప్పుడు వ్యావహారికోద్యమం బయల్దేఱడానికి కొన్నివందలేండ్ల పూర్వమే ఈ అయోమయం (confusion) ఉనికిలో ఉన్నట్లు కనిపిస్తోంది. మన గురుపరంపరలో బాగా వెనక్కి జఱిగితే- అంటే మన గురువుల గురువులూ, వారి గురువులూ, పరమగురువులూ చదువుకున్న రోజుల దగ్గఱికి ప్రయాణిస్తే అప్పట్లో పాఠశాలలూ, చదువులూ అందఱి కోసమూ కాదు. కొందఱి కోసమే. ఆ చదువులు కూడా ఈ రోజుల్లో మాదిరి అన్ని సబ్జెక్టులకీ సంబంధించినవి కావు. భాషాసాహిత్యాలూ, తర్కం, వేదాంతం లాంటి కొన్ని సబ్జెక్టులకు మాత్రమే. అవన్నీ సంస్కృతంలో ఉండేవి. సంస్కృతం చదివితే తెలుగు కూడా వచ్చేసినట్లేనని భావిస్తూ,అయినా తెలుగులో ఏముందిలే ?అని ఈసడించుకున్న రోజులవి. అందుచేత సంస్కృతంలో లేని, తెలుగులో మాత్రమే ఉన్న ఈ రేఫల వ్యత్యాసం వారి మనసులకు అంత గట్టిగా హత్తుకున్నది కాదు. పైపెచ్చు వారు భాషాపండితులు కావడంతో పాటు మతగురువులు కూడా కావడాన, మతంలోని మంత్రోచ్చారణలకున్న నియమాల దృష్ట్యా మంత్రేతరమైన మామూలు (మాతృభాషా) పదాల్ని కూడా అంతే స్పష్టతతో చాదస్తంగా పలకడం ప్రారంభించారు. అందువల్ల కూడా రేఫల మధ్య వ్యత్యాసం అంతరించసాగింది.

మనం చేయాల్సినది


నిజానికి భాషలోని అన్ని అక్షరాల్నీ ఒక్కలాంటి ఊనికతోనే పలక్కూడదు. వాటిల్లో ఊది పలకాల్సినవీ ఉంటాయి. తేల్చిపలకాల్సినవీ ఉంటాయి. కానీ మన ప్రాచీన పండితులకున్న మంత్రాక్షర స్పష్టతావ్యామోహం మూలాన ఆ భేదం అంతరించింది. వారు ఎలా మాట్లాడితే, ఎలా వ్రాస్తే అదే ప్రమాణంగా భావించేది మన పూర్వసమాజం. ఎందుకంటే వారు విద్యావంతులు, గురుకుల క్లిష్టులు, శాస్త్రజ్ఞానులూను. అందుచేత వారి ననుసరించి మిగతావారు కూడా వివిధ రేఫల మధ్య వ్యత్యాసాన్ని పరిహరించి ఒకేలా పలకడం మొదలుపెట్టారు. యద్యదాచరతి శ్రేష్ఠస్ తత్తదేవేతరో జనః అని కదా గీతావాక్యం. ఈ పరిణామం తెలుగులోనే కాక ద్రావిడభాషలన్నింటిలోనూ ఇలాగే జఱిగినట్లు గోచరిస్తోంది.

అయితే ఒక చిన్నతేడా ఉంది. ఆధునిక తెలుగు-కన్నడ భాషల్లో రెండురేఫలకీ ఒకే రకారం వ్రాస్తున్నారు. అలాగే పలుకుతున్నారు కూడా ! కానీ తమిళ, మలయాళాల్లో వాటిని ఒకేలా పలుకుతున్నప్పటికీ వేఱువేఱు లిపిచిహ్నాలతో సూచిస్తున్నారు. ఇది మిక్కిలి ప్రశంసనీయం. ఎందుకంటే అక్షరాలూ, పదాలూ ఉచ్చారణగతిలో ఎలా మారినా, ఎన్నిసార్లు మారినా వ్రాతలో మాత్రం పూర్వీకులు వ్రాసినట్లే వ్రాయడం ద్వారా ఆ పదాల చరిత్రని భావితరాల కోసం కాపాడినవాళ్ళమవుతాం. ఉచ్చారణతో పాటు గుణింతస్వరూపాన్ని (spelling) కూడా మార్చేస్తే ఆ భాష యొక్క ప్రాచీనస్వరూపం శాశ్వతంగా మఱుగున పడిపోతుంది. అందుకనే పాశ్చాత్యులు స్పెల్లింగ్ రూపంలో తమ భాషాపదాల పూర్వరూపాల్ని శ్రద్ధగా భద్రపఱిచారు. దీనివల్ల లిపిలో ఉచ్చారణవిధేయత కొఱవడినప్పటికీ వ్యాకరణ-పరిణామ నియమాలు విద్యార్థులకి చక్కగా అవగతమవుతాయి.   

చాలామంది భావిస్తున్నట్లుగా శకటరేఫకీ గ్రాంథికవాదానికీ బాదరాయణ సంబంధమేమీ లేదు. ఒకప్పటి వ్యావహారికవాదులు అనవసరంగా శకటరేఫ మీద యుద్ధం ప్రకటించారనిపిస్తుంది. ఆలోచిస్తే భాషలో నిరర్థకమైన భాగమంటూ ఏదీ లేదు. అన్నీ అవసరాన్ని పురస్కరించుకుని ఉనికిలోకొచ్చినవే. కనుక ఈ భాష యొక్క సాంస్కృతిక వారసులుగా ఈ భాషలోని ప్రతి ఒక లిపిచిహ్నాన్నీ కాపాడుకోవడం మన విధ్యుక్త ధర్మం. అందుచేత ఇప్పటికైనా మనవారు మేలుకొని మన పాఠశాలల్లో రేఫోచ్చారణల్లోని వ్యత్యాసాన్ని గుర్తుపట్టే పద్ధతులు బోధించడం మొదలుపెట్టాలి. సాఫ్టువేర్లలో దానికి స్థానమివ్వాలి. వ్యావహారిక రచయితలు కూడా దాన్ని తమ రచనల్లో విఱివిగా వాడడం మొదలుపెట్టాలి. మనకి ఒక అక్షరమే మోయలేని భారమైతే మఱి వేలాది అక్షరాలున్న చైనీస్ సంగతి ఏమనుకోవాలి ? వారు డిగ్రీలో కూడా కొత్త అక్షరాలు నేర్చుకుంటూనే ఉంటారట

4 వ్యాఖ్యలు:

 1. Interesting. You could have given some examples with usage of these letters. Of course, you have mentioned గుఱ్ఱం. I have seen few people using ఱ in every place where "ra" sounds. Is that correct?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. @సూర్యుడుగారు... మీ సూచనకు నెనర్లు. రాబోయే టపాలలో ఎప్పుడైనా శకటరేఫ గల తెలుగుపదాల జాబితాని ప్రదర్శించగలనని మనవి.

   దయచేసి మీ అమూల్యమైన వ్యాఖ్యలు తెలుగులో వ్రాయడానికి ప్రయత్నించవలసిందిగా నా అభ్యర్థన. తెలుగుబ్లాగు మధ్యలో ఇంగ్లీషు కనిపిస్తే ఇబ్బందిపడే పాఠకులు కొందఱున్నారు.

   తొలగించు